Telugu Rekha Media - జిల్లా వార్తలు / జగిత్యాల్ : స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎటువంటి ఇబ్బందులకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించే విధంగా తగు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. బుధవారం రోజున కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులందరూ సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ లో పతాకావిష్కరణ జరుగుతుందని అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ముఖ్య అతిథి జెండా ఎగురవేస్తారని పేర్కొన్నారు. పరేడ్ గ్రౌండ్ లో అంబులెన్స్, మెడికల్ ఆఫీసర్లు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి అవసరమైన ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ తో అందుబాటులో ఉండాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ముఖ్య అతిథిచే ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై ప్రగతి నివేదిక సందేశం ఉన్నందున విద్యుత్ కు ఎటువంటి అంతరాయం కలుగకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని విద్యుత్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రజా ప్రతినిధులకు, అధికారులకు సీట్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు గ్రౌండ్ లో ఎండలో డ్యాన్స్ చేస్తున్నందున వారికి ప్రియారిటి ఇచ్చి రిఫ్రెష్ మెంట్, మంచి నీరు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన మహాలక్ష్మి, గృహలక్ష్మీ, ఆరోగ్య శ్రీ, రుణమాఫీ, రైతు భీమా, ఆయిల్ ఫామ్ లకు సంబంధించిన స్టాల్ల్స్ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు పి.రాంబాబు, గౌతమ్ రెడ్డి, కలెక్టరేట్ ఏ.ఓ హన్మంతరావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media