Telugu Rekha Media - తెలంగాణ / భూపాలపల్లి : జిల్లాలో వంద శాతం పంట నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శనీవారం సమీకృత కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ శాఖకు సంబంధించి రైతు భరోసా , పంట భీమా, పంట నమోదు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటు, వాటి తనిఖీ లు, మట్టి నమూనాలు సేకరణ, పంట దిగుబడి, లక్ష్యం, సాధింపు, వర్షాభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు సాగు తదితర అంశాలపై వ్యవసాయ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వందకు వంద శాతం పంటనమోదు ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. రైతు భరోసా, రైతు భీమా, పీఎం కిసాన్ లాంటి పథకాలను క్షేత్ర స్థాయిలో రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. వానాకాలంలో పంటలను కాపాడు కోవడానికి తీసుకునే చర్యలపై రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో ఎరువుల కొరత లేకుండా చూడాలని పంటలకు సరిపడా యూరియా , డిఏపి, ఇతర ఎరువులను అందుబాటులో ఉంచాలని, ఎరువుల కృత్రిమ కొరత, ఎరువులను అధిక ధరకు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అధిక దిగుబడి వచ్చే లాభసాటి పంటలు, మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. అంతే కాకుండా ప్రతి 15 రోజులకొకసారి పురుగు మందుల దుకాణాలను తనిఖీ చేయాలనీ, నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయించే వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్ష పాతం తక్కువ నమోదైన నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటల సాగు చేపట్టేందుకు మొగ్గుచూపు విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. వరి విత్తనాలు కొరత లేదని సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వర్షా భావ పరిస్థితులు నేపథ్యంలో వరి సాగుకు జాప్యం అవుతున్నందున రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నయంగా మొక్కజొన్న తదితర ఆరుతడి పంటల సాగు చేపట్టే విధంగా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలన్నారు. రానున్న 15 రోజుల్లో వర్షాలు పడనట్లయితే వరి సాగుకు అనుకూలత లేని కారణంగా ఆరుతడి పంటల సాగు విత్తనాలను అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. మిర్చి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఎలాంటి కొరతలేదని ఎక్కడైనా విత్తనాలు కొరత ఉన్నట్లయితే ఆయా మండల వ్యవసాయ అధికారులను కానీ లేదా జిల్లా వ్యవసాయ అధికారిని కానీ సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. ఏదేని సహయతకు జిల్లా వ్యవసాయ అధికారి విజయ భాస్కర్ 7288894787 నంబర్ కు నేరుగా కాల్ చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయభాస్కర్ మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media