Telugu Rekha Media - తెలంగాణ / జగిత్యాల్ : ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగులను నిర్మూలిద్దామని, జిల్లాలో ఈ నెల 20న జరుగనున్న జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని పిల్లలందరికీ నులిపురుగు నివారణ కొరకు ఆల్బండజోల్ మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు అన్నారు. జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవ కార్యక్రమానికి పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐడీవోసీ సమావేశ మందిరం జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు అధ్యక్షతన వివిద అనుబంద శాఖల, జిల్లా స్థాయి ఉన్నత అధికారులకు సమావేశం నిర్వహించారు. ఇంచార్జీ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. సమియుద్దీన్ సమన్వయ కర్తగా కార్యక్రమ వివరాలను వివరించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నులిపురుగు నివారణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని సూచించారు. 01-19 సంవత్సర వయస్సు గల అందరు పిల్లలకు అల్బెందజోల్ మాత్రలు వేయించాలని, ఈ కార్యక్రమం గురించి విస్తృత ప్రచారం చేయాలని, పాఠశాలల్లో, కళాశాలల్లో, సామాన్య శాస్త్ర ఉపాధ్యాలు ఎలికపాములు సంక్రమణ వల్ల కలిగే దుష్ప్రభవాల గురించి ప్రార్ధన సమావేశాల్లో, తరగతి గదిలో విద్యార్ధులకు వివరించి, అవగాహణ కల్పించాలన్నారు. ఈనెల 20 న ఆల్భండజోల్ జోన్ మాత్రలు వేసుకునే విధంగా చూడాలని, 20 న తప్పిన పిల్లలకు 27 తేదిన నిర్వహించే “మ్యాప్- అప్” రోజున మాత్రలు వేయించాలని తెలిపారు. అలాగే జిల్లా విద్యాధికారి,ఇంటర్మీడియట్ విద్యాధికారి, ఎస్సీ, ఎస్టీ, బి.సి. మైనారిటి రెసిడెన్సియల్ పాఠశాలల సంక్షేమ అధికారులు, అందరు విద్యార్ధులకు మాత్రలు వేసుకునే విధంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లాపరిషత్ సి.ఈ.వో,డి.పి.వో, డీఆర్డీవో లు, మండల అభివృద్ధి అధికారులు, పంచాయితి సేక్రేటరీలు, అంగన్ వాడి కార్యకర్తలకు, మెప్మా సిబ్బంది కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటూ స్టానిక సిబ్బందికి సహకరించాలన్నారు. అన్ని గ్రామాల్లో, మున్సిపాలిటిలలో టాం-టాం, టి.వి. వార్త పత్రికల్లో నులి పురుగు నివారణ కార్యక్రమం గురించి విస్తృత ప్రచారం కల్పించేలా చూడాలని కోరారు. అలాగే ఐ.ఎం.ఏ ఇతర స్వచ్చంద సంస్థలు జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.. జిల్లాలోని 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల 2,52,158 పిల్లలు ఉన్నట్లు అంచనా వేయడం జరిగిందని, వీరందరికి అంగన్ వాడి కేంద్రాలలో మరియు పాఠశాలల్లో ఆల్భండజోల్మాత్రలు వేయబడునని, పాఠశాలలోని విద్యార్థులకు ( 6-19సం.) వయస్సు గలవారికి ఉపాద్యాయులు ఈ మాత్రలు వేయనున్నట్లు,. అంగన్ వాడిలో నమోదు అయిన పిల్లలకు,ఏ పాఠశాలలో నమోదు కాని పిల్లలకు అంగన్ వాడి కేంద్రాల్లో ఈ మాత్రలు వేయబడునని తెలిపారు. జబ్బు చేసిన, ఏదైనా చికిత్స పొందుచున్న పిల్లలకు కోలుకున్న తరువాత మాత్రమే ఈ మాత్రలు వేయాలని, ఎవరైనా ఈ రోజున మాత్రలు తీసుకోనివారికి ఇదేనెల (జూన్ ) 27న నిర్వహించే “మ్యాప్- అప్” రోజున మాత్రలు వేయబడునని, ఈ అల్బెందజోల్ మాత్రలు నమలడం లేదా చప్పరించి మింగవలెనని,1-2 సం. పిల్లలకు అర మాత్ర, 2-5 సం. వయస్సు వారికి 1 మాత్ర పౌడర్ రూపంలో నీటిలో కరిగించి తాగిపించవలేనని, 6-19 సం. మధ్య వయస్సు వారికి ఒక మాత్ర నమిలి మింగవలెనని తెలిపారు. నమిలి మింగడం వల్లే మందు ప్రభావవంతంగా పనిచేస్తుందని తెలిపారు. మాత్ర వేసుకొనుటకు కాచి చల్లార్చిన నీటినే వాడాలని, కలుషిత నీరువల్ల ఇతర దుష్ప్రభవాలు కలిగే అవకాశం ఉందని, జాగ్రత్తలు వహించాలని కోరారు. ఉపాద్యాయులు ఈ కార్యక్రమాన్ని గూర్చి బ్లాక్బోర్డ్ పై వ్రాయడం, ప్రార్థన సమావేశంలో వివరించాలని తెలిపారు. మాత్రల పంపిణి రోజు అందరు విద్యార్థులు హాజరయ్యే విధంగా, అందరికి మాత్రలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.మెడికల్ సూపరిండెంట్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, టి.వి.వి. జిల్లా కోఆర్డినేటర్ లు కార్యక్రమంలో ఏదైనా అనుకోని సంఘటన జరిగినట్లయితే ఎదుర్కొనుటకు సంసిద్దంగా ఉండాలని ఆదేశించారు. అన్ని శాఖాల అధికారులు ఒకరితో ఒకరు సహకరించుకుంటూ సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రానున్న వర్షాకాలం నైపథ్యంలో దృష్ట వ్యాధులు నివారణ నియంత్రణ చర్యలు, సంసిద్దత గురించి జిల్లా టాస్క్ ఫోర్స్ మీటింగ్ లో చర్చించడం, వివిధ శాఖల మద్య సమన్వయ పరచడం గురించి వివరించారు.. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సి.ఇ.వో. ఎం. రఘువరన్, ఆర్డీవో ఎం. సంపత్ రావు, జిల్లా పంచాయితీ అధికారి ఓ. దేవరాజ్,జిల్లా విద్యాధికారి ప్రతినిధి,ఇంటర్మీడియట్ విద్యాధికారి బి. నారాయణ,ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటి సంక్షేమ శాఖల జిల్లా అధికారులు, ప్రభుత్వ ఆసుపత్రుల మెడికల్ సూపరిండెంట్ లు, మున్సిపాల్ కమిషనర్, డిప్యూటి డి.ఎం.హెచ్.వో, ప్రోగ్రాం అధికారులు, డిపిఆర్వో తదితరులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media