Telugu Rekha Media - తెలంగాణ / : గురువారం హైదరాబాద్ నుండి పలువురు మంత్రులు, రాష్ట్ర ఉన్నతాధికారుల సమక్షంలో రైతు రుణమాఫీ 2020-2024 నిధుల విడుదల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ అనేది దేశంలోనే అద్భుతమైన గొప్ప కార్యక్రమం అని పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీని అమలు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ మాట ఇస్తే శిలా శాసనమేనని, ఇచ్చిన మాటను తప్పకుండా అమలు చేస్తుందన్నారు. ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కరీంనగర్ లో నిర్వహించిన సభలో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు హామీ ఇచ్చారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే పార్టీకి ఎన్నో అవరోధాలు, అడ్డంకులు, నష్టం జరుగుతుందని తెలిసీ కూడా వెనక్కి తిరగకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని అన్నారు. మాట తప్పని.. మడమ తిప్పని నాయకురాలు సోనియా గాంధీ అని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్ర ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని నిలబెట్టుకోలేదని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీని తప్పకుండా నెరవేరుస్తుందన్నారు. వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ లక్షలాదిమంది రైతుల సమక్షంలో 2 లక్షల రుణమాఫీకి హామీ ఇచ్చారని అన్నారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో సోనియా గాంధీ 6 గ్యారెంటీలను ప్రకటించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు లక్షల రుణమాఫీని అమలు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో ఒకటైన రైతు రుణమాఫీని ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులను బ్యాంకులలో ఉన్న రుణమాఫీ నుండి విముక్తిని ప్రభుత్వం కలిగిస్తుందన్నారు. రైతు రుణమాఫీ అనేది మన జీవితంలో మర్చిపోలేని విషయమని, లక్షలాది మంది రైతులకు రుణమాఫీ ని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రైతుల రుణమాఫీ కి హామీ ఇచ్చి విస్మరించారని అన్నారు. తన పాలనలో అప్పులతో బాధపడుతున్న రైతులను పట్టించుకోలేదన్నారు. కానీ తమ ప్రభుత్వం రైతు రుణమాఫీని సంకల్పంతో అమలు చేస్తుందన్నారు. సున్నా నుంచి లక్ష రూపాయల వరకు ఉన్న రైతులకు రుణమాఫీని మొదటి దశలో నేటినుండి చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు, మూడు దఫాల్లో 2లక్షల వరకు రైతు రుణమాఫీని అమలు చేస్తామన్నారు. రైతు రుణమాఫీకి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడం లేదని అన్నారు. రైతులు బ్యాంకుల్లో పెట్టిన పాస్ పుస్తకాల ప్రకారం అప్పు తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని, రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ నే అని చెప్పారు. రైతును రాజు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ మాట ఇస్తే అది శిలా శాసనం అని, వారు ఇచ్చిన హామీని తప్పకుండా అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో రైతులకు అమలు చేస్తున్న రుణమాఫీ గురించి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు గ్రామ సభలు పెట్టి వాటి గురించిన వివరాలను గ్రామస్తులకు తెలియజేయాలన్నారు.
వరంగల్ లో లక్షలాది మందితో రాహుల్ గాంధీ సభ.. అంతకుముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు వేదిక నుంచి వరంగల్ కు చెందిన రైతు ఎల్లయ్య మాట్లాడగా తన ప్రసంగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ లో లక్షలాది మంది రైతులతో కృతజ్ఞతా సభను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రైతు ఎల్లయ్య సూచనల మేరకు రైతు డిక్లరేషన్ సభను నిర్వహించిన వరంగల్ లోనే సోనియా గాంధీ,రాహుల్ గాంధీ లకు తెలిపే విధంగా సభను నిర్వహించబోతున్నట్లు చెప్పారు. లక్షలాది మంది రైతులతో నిర్వహించనున్న సభలో రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పెద్ద పండుగల జరుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమం భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగినదని పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీని చేయలేదన్నారు. ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందన్నారు. ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని, ఈ హామీని అమలు చేస్తారా లేదా అని అనుకున్నారని, ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తుంటే ఆశ్చర్యంగా చూస్తున్నారని అన్నారు. ఆగస్టు 15లోగానే రుణమాఫీ హామీని నిలబెట్టుకుంటామన్నారు. రైతుల రుణమాఫీ కోసం 31 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఒకేసారి కట్టిన చరిత్ర దేశంలోనే ఎక్కడా లేదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో నిలిచేలా రుణమాఫీ చేస్తుందన్నారు. రైతు రుణమాఫీ పట్ల ప్రతి రైతు ఆనందించాల్సిన విషయం అన్నారు. రెండు లక్షల రైతు రుణమాఫీ ని అమలు చేస్తుంటే దేశంలోని మిగతా రాష్ట్రాలు ఆశ్చర్యంగా చూస్తున్నాయన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మిగిల్చిందన్నారు. గత ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ ని కూడా చేయలేదని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ తెలంగాణలో అమలు చేస్తున్న 2 లక్షల రూపాయల రుణమాఫీ దేశ చరిత్రలోనే గొప్ప కార్యక్రమమని పేర్కొన్నారు. రైతులకు అందిస్తున్న రైతు రుణమాఫీ విషయంలో తెలంగాణ రాష్ట్రం మోడల్ గా నిలిచిందన్నారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని రైతు రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర రైతాంగం తమ గుండెల్లో పెట్టుకునేలా రుణ మాఫీ హామీని నెరవేర్చినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన రైతులు రైతు రుణమాఫీ చేయడం పట్ల మాట్లాడారు. రైతులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంభాషించారు. అనంతరం పలువురు రైతులకు రైతు రుణమాఫీ కి సంబంధించి చెక్కులను ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమాన్ని హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలోని రైతు వేదికలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీడ్స్ అండ్ ఫెడరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, ఏడిఏ దామోదర్ రెడ్డి తదితరులు రైతులతో కలిసి ముఖ్యమంత్రి, మంత్రుల ప్రసంగాలను వీక్షించారు. కార్యక్రమం అనంతరం జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ రైతును రాజు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతు సంక్షేమం విషయంలో ఆనాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తరువాత నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కే ఘనత దక్కుతుందన్నారు. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం పట్ల రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ జిల్లాలో 22 వేల మందికి పైగా రైతులకు 145 కోట్ల రూపాయలను రుణమాఫీ జరిగిందన్నారు. రెండు, మూడో విడతల్లో మిగతా రైతులకు రుణమాఫీ జరగనుంది అన్నారు. రుణమాఫీ కి సంబంధించి బ్యాంకర్లతో కూడా సమావేశాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆ సమావేశంలో వ్యవసాయానికి తీసుకున్న రుణాలకు మాత్రమే రుణమాఫీ డబ్బులను బ్యాంకర్లు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. వేరే ఇతర రుణాలు తీసుకుంటే వాటి కింద రైతు రుణమాఫీ డబ్బులను తీసుకోవద్దని బ్యాంకర్లను ఆదేశించినట్లు వెల్లడించారు. మండల వ్యవసాయ కార్యాలయాల్లో ఫిర్యాదుల కోసం కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media